తెలంగాణ

telangana

ETV Bharat / state

అదిగో టీకా.. లెక్క పక్కా... - covid Vaccine Every information is in the cowin app

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్‌ టీకా పంపిణీ ప్రక్రియ మరో 4 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో టీకాలు వేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

vaccine
అదిగో టీకా.. లెక్క పక్కా...

By

Published : Jan 12, 2021, 6:56 AM IST

రాష్ట్రానికి తొలుత 6.5 లక్షల టీకా డోసులు రానుండడంతో.. ప్రతి టీకాను అర్హులైన వారికి చేర్చే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఎవరెవరికి తొలిడోసును అందిస్తున్నారనే పక్కా సమాచారాన్ని ‘కొవిన్‌’ యాప్‌లో పొందుపరచనుంది. వ్యాక్సిన్‌ లెక్క తప్పకుండా.. పక్కదారి పట్టకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిల్వ కేంద్రాలు, సరఫరా, పంపిణీ కేంద్రాల వరకూ అన్నిచోట్లా నిఘా కొనసాగించేందుకు విజిలెన్సు యంత్రాంగాన్ని కూడా నియమించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయుల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను నియమించినా.. క్షేత్రస్థాయిలో పంపిణీ సజావుగా కొనసాగించేందుకు వీలుగా కలెక్టర్లకు ప్రభుత్వం విస్తృత అధికారాలను అప్పగించింది. కలెక్టర్లతో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ విషయాలపై చర్చించినట్లుగా తెలిసింది.

ఎందుకింత కట్టుదిట్టం?

దేశం మొత్తమ్మీద 30 కోట్ల మందికి, రాష్ట్రంలో 75 లక్షల మందికి కొవిడ్‌ టీకాను ప్రభుత్వమే ఉచితంగా అందజేయనుంది. ఈ ప్రక్రియ దాదాపు 6 నెలలకు పైగానే కొనసాగనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బహిరంగ విపణిలోకి కొవిడ్‌ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వదని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి టీకాకూ పక్కాగా లెక్క చెప్పాల్సిందే. అర్హులైన ప్రతి లబ్ధిదారుకు టీకాను అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కేవలం ప్రభుత్వ వైద్యంలోనే అందజేయాలని నిర్ణయించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌.. బహిరంగ విపణిలోకి వక్రమార్గంలోకి చేరితే.. అది తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలను పంపిణీ చేసినా అక్కడా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీకా వృథా అవడంగానీ.. పక్కదారి పట్టడం గానీ.. లేకుండా ప్రతిదశలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

టీకాల కేంద్రాలకు నిమ్స్‌ నిపుణులతో టెలీవైద్యం

కొవిడ్‌ టీకాలు ఇచ్చే క్రమంలో ఎవరిలోనైనా దుష్ఫలితాలు తలెత్తితే.. సత్వరమే వైద్యసేవలందించడంతో పాటు అవసరమైతే.. నిమ్స్‌కు చెందిన వైద్యనిపుణులతో టెలీ వైద్యవిధానంలో సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అన్ని స్థాయుల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

  • రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రానికి టీకాలు చేరిన దగ్గర నుంచి పటిష్ఠ భద్రత కొనసాగుతుంది.
  • ఒకచోటు నుంచి మరోచోటుకి చేర్చడానికి అవసరమైన వాహనాలను, పరికరాలను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.
  • నిల్వ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే సత్వరమే అప్రమత్తం చేయడానికి విజిలెన్స్‌ విభాగం పనిచేస్తుంది.
  • రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్‌ కమిటీ ఉండగా.. ఆరోగ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, కలెక్టర్లు ఛైర్మన్లుగా జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు, తహసీల్దార్లు ఛైర్మన్లుగా మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు పనిచేస్తుంటాయి.
  • ఇదీ చూడండి:అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details