హైదరాబాద్ నగరవాసులను గ్రామసింహాలు వణికిస్తున్నాయి. వీధుల్లో నడవాలంటే ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు వణికిపోతున్నారు. గల్లీల్లో గుంపులుగా స్వైరవిహారం చేస్తూ... పాదాచారులుపైకి తెగబడుతున్నాయి. వాహనదారుల వెంట పరుగులు తీస్తూ... గుబులు రేపుతున్నాయి. పట్టపగలే కుక్కలు దాడులు చేయటం వల్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాత్రివేళల్లో అయితే చెప్పనక్కర్లేదు. వీధుల్లోకి ఒంటరిగా ఏం కర్మ... గంపుగా రావాలన్నా గజగజా వణికిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దర్జాగా దాడులు...
గతంలో కార్పొరేషన్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుని చంపేసేవారు. జంతు సంరక్షణ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల కుక్కలను వధించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి గల్లీల్లో కనిపించే వ్యక్తుల మీద దర్జాగా దాడులు చేస్తున్నాయి.