Street Dogs Attacks in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. శునకాల దాడిలో హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటన మరవక ముందే మరిన్ని దాడుల ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 10 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఖైరతాబాద్‌లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్క దాడి చేసింది. ఆనందనగర్‌లోని ప్రొటోకాల్ ఏపీ పోలీస్ కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికురాలు రామేశ్వరి రోడ్డును శుభ్రం చేస్తుండగా అక్కడే ఉన్న కుక్క ఆమె కాలుపై కరిచింది. దీంతో రామేశ్వరి కిందపడిపోగా.. కుక్క చెవిని కొరికేసింది. గాయపడిన బాధితురాలికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
Street Dog Attacks in Hyderabad: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండాలో జర్పుల వెంకటేశ్ కుమారుడు విష్ణువర్ధన్(5), గోవింద్ కుమారుడు ఆనంద్(5), సర్ధార్ కుమారుడు భరత్(6) ఇళ్ల ముందు ఆడుకుంటున్న సమయంలో.. అటుగా వచ్చిన ఓ పిచ్చి కుక్క తొలుత విష్ణువర్ధన్‌పైన, తరువాత ఆనంద్, భరత్‌లపై దాడి చేసింది. చిన్నారులను చికిత్స నిమిత్తం కుటుంబీకులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు.