మేయర్, ఉపమేయర్ అభ్యర్థిత్వం విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈనెల 11న ఉదయం పేర్లతో కూడిన షీల్డ్‌కవర్‌ను బల్దియా కార్యాలయానికి నేతలు తీసుకురాబోతున్నారని తెలిసింది.
బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాలేదు. ఎక్స్‌అఫిషియో ఓట్లతో పదవి దక్కించుకోవాలని తెరాస నేతలు నిర్ణయించారు. మేయర్ ఎన్నిక సమయంలో ఎంఐఎం సభలో ఉంటుందా? అభ్యర్థిని నిలుపుతుందా అనేది తేలాల్సి ఉంది. మంగళవారం నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తూ..
మేయర్ పీఠం కోసం తెరాస అధిష్ఠానంపై కార్పొరేటర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి మహిళకే పదవి కట్టబెట్టనున్నారు. తెరాస పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ తన భార్య, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నారు. అలానే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పదవివి ఆశిస్తున్నారు. వెంకటేశ్వరనగర్, భారతీనగర్ కార్పొరేటర్లు కవితారెడ్డి, సింధురెడ్డిల పేర్లూ వినిపిస్తున్నాయి. ఉపమేయర్‌గా మైనార్టీ వర్గానికి చెందినవారినే ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: అందరి చూపు.. మేయర్ ఎన్నిక వైపు..