ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తిరుపతిలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు సాగించినా.. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పు ఇస్తుండడం.. ఆలోచింపజేస్తోంది. ఈ సారి తిరుపతి ఓటరు నాడి ఎలా ఉండబోతోందన్నది.. రాజకీయ వర్గాలతో పాటు.. ప్రజానీకంలోనూ ఆసక్తిని పెంచుతోంది.
సంప్రదాయానికి భిన్నంగా..
సాధారణంగా లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్న పార్టీ అభ్యర్థే.. లోక్‌సభ స్థానంలో విజయం సాధిస్తారు. తిరుపతిలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పలితాలు వెలువడుతున్నాయి. స్వాతంత్య్రం అనంతరం 1952 నుంచి 1980 వరకు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1983లో తెదేపా ఆవిర్భావం అనంతరం కొంత రాజకీయంగా మార్పులు వచ్చినా లోక్‌సభ స్థానాన్ని మాత్రం ఎక్కువ సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకొంది. నాలుగు సార్లు మినహా తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పన్నెండు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా ఓ సారి తెదేపా, మరోసారి తెదేపా బలపరచిన భాజపా అభ్యర్థి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
తెదేపా ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల వరకు తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించినా ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి శాసనసభ స్థానాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట, సర్వేపల్లి శాసనసభ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఎంపీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ విజయం సాధించారు.