TS Assembly Session: రాష్ట్రంలో అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాలు, విమర్శల దాడులు, ఎదురుదాడులతో రాజకీయ వాతావరణం గరంగరంగా ఉన్న తరుణంలో శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అరుదైన రీతిలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది డిసెంబరు వరకు ఉండగా... ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కానుంది. కొవిడ్ నిబంధనల మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేశారు.
వివాదాలతో మొదలు
గత ఏడాది అక్టోబరు 8న శాసనసభ సమావేశాలు ముగిశాయి. అప్పటి నుంచి సభ ప్రొరోగ్ కాలేదు. అవే సమావేశాలను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. సభ ప్రొరోగ్ కానందున గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించనున్నారు.
దీనిపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యులు ప్రభుత్వ పనితీరుపైన, ప్రజా సమస్యలపైన చర్చించే అవకాశం కోల్పోతారని తెలిపారు. దీనిపై ప్రభుత్వవర్గాలు అనధికారిక ప్రకటనలో వివరణ ఇచ్చాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అవసరం లేని అంశాలపై అభ్యంతరాలు చెబుతున్నారని ఉదాహరణలతో ఆమె వైఖరిని విమర్శించాయి. శాసనసభలో దీనిపై మొదట్లోనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
రగులుతున్న రాజకీయ వేడి
కేంద్రప్రభుత్వం, భాజపాపై ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ దాడిని ప్రారంభించారు. గత నెలలో జరిగిన ప్రధాని మోదీ పర్యటనలో సీఎం పాల్గొనలేదు. ప్రధానిపై, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు భాజపా, కాంగ్రెస్‌లు ప్రభుత్వ విధానాలపై పోరుబాట సాగిస్తున్నాయి. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు నిరంతర కార్యక్రమాలతో ప్రభుత్వ వైఖరిపై దండెత్తుతున్నారు. వైఎస్సార్ తెలంగాణ, బహుజన్‌సమాజ్ పార్టీలు సైతం ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతున్నాయి.
15 రోజుల పాటు సమావేశాలు!