కొవిడ్- 19 విపత్కర పరిస్థితుల మధ్య ప్రపంచమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. ఈ సమయంలో హైదరాబాద్ మహా నగరం.. మహమ్మారికి విరుగుడును కనిపెట్టేందుకు సమాయత్తమైంది. నగరంలో 5 వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు యాంటీ డోట్ను ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్(బీఈ), అరబిందో ఫార్మా సంస్థలు కరోనా టీకా తయారీలో వివిధ దశల్లో ఉన్నాయి. రెడ్డీస్ ల్యాబ్, హెటిరో ఫార్మసీ సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు పలు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరికొన్ని ఫార్మా కంపెనీలు టీకా తయారీకి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
మరో వైపు కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముందుకు వచ్చింది. ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సర్వీస్.. తన వాటాదారులతో టీకా ఎగుమతులు, దిగుమతులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపింది. వ్యాక్సిన్ పురోగతిపై భారత్ బయోటెక్, బీఈలను ప్రముఖులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. దీన్ని బట్టే టీకాను అందించడంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
'ప్రపంచ దేశాలకు కొవిడ్- 19 టీకా ఎగుమతులపై మా వద్ద ఇప్పటివరకు ఎటువంటి పాలసీ లేదు. ఎగుమతులకు సంబంధించి ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొదట స్వదేశీ అవసరాలు తీరిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. భారత్ బయోటెక్ మినహా మిగతా ఫార్మా సంస్థలు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి.'
ఉదయ్ భాస్కర్, ఫార్మాఎక్సిల్ డైరెక్టర్ జనరల్
'వ్యాక్సిన్ తయారీ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ నిర్ణయం లేదు. టీకా కేటాయింపు నిర్ణయం కేవలం కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. ఆ ప్రాతిపదికనే రాష్ట్రాలు వ్యాక్సిన్‌ను పొందుతాయి.'
జి. శ్రీనివాసరావు, తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు
మరో టీకా ప్రయోగంలో భారత్ బయోటెక్
'కొవ్యాక్జిన్' తయారీలో భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో కలిసి పనిచేస్తోంది. ఇదే కాకుండా మరో టీకాను బయటకు తెచ్చేందుకు ప్రయోగాలు ప్రారంభించింది. టీకా పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించారు. ల్యాబ్‌లో వ్యాక్సిన్ తయారీకి ఉన్న సౌకర్యాలపై 60 మంది పైగా విదేశీ ప్రతినిధులు కూడా భారత్ బయోటెక్‌లో అధ్యయనం చేశారు. దీంతో పాటు కొవిడ్- 19 నివారణకు నాసల్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది భారత్ బయోటెక్. దేశీయంగా తక్కువ ధరలో వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ కృషి చేస్తోందని సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.