Current Status of Hyderabad Roads :నగరంలోని ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం. ఒక్కో రోడ్డుపై లెక్కపెట్టలేనంతగా గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెసుకోవడం వాహనదారులకు ఓ పజిల్‌గా మారిపోయింది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల పునరుద్ధరణ కోసం 255.66 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చేతులెత్తిసిన ప్రైవేట్ సంస్థలు..నగర వ్యాప్తంగా 9వేల103 కిలోమీటర్ల రహదారులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 811 కిలోమీటర్ల ప్రధాన రహదారులను ఐదేళ్లు గుంతల్లేకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ.. ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అందుకు 1,850 కోట్ల రూపాయలు చెల్లించాలని ఒప్పందం ఉంది. ఒప్పందం చేసుకున్న రెండేళ్లు ఆయా రోడ్లను గుత్తేదారులు మెరుగ్గా నిర్వహించినా.. ఏడాదిగా చేతులెత్తేశారు. ఆ సంస్థల నిర్లక్ష్యాన్ని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెబుతున్నారు.
Current status of Hyderabad roads :ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చిన రోడ్లు మినహా మిగిలిన 8వేల 500ల కిలోమీటర్ల రోడ్లు జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది. వాటిని మెరుగ్గా ఉంచేందుకు ఏటా 800 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ తారు రోడ్ల నాణ్యత ఏమాత్రం మెరుగవ్వడంలేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, రిపేర్ల సమయంలో అధికారులు నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడంతోనే సమస్య ఏర్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసిన కొన్నాళ్లకే పాడైపోతున్నాయి.
Damaged Hyderabad Roads :రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ముఖ్యంగా సంస్థల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగానే చాలా చోట్ల ఈ పరిస్థితి తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఎండీడబ్య్లూఎస్తో పాటు వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. ఓ వైపు నాలాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేయగా, మరోవైపు మురుగునీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దుర్భరంగా మారాయి.