అవసరం ఎలాంటిదైనా.. అవరోధం ఎంత పెద్దది అయినా పరిష్కారం మాత్రం ఆవిష్కరణలే. అలాంటి అరుదైన ఆవిష్కరణతోనే ఆకట్టుకుంటున్నాడు...హైదరాబాద్ యువకుడు మాచర్ల రాహుల్. మెుక్కలకు నీటి కొరత సమస్య తీర్చేందుకు, అన్నదాతలకు తనవంతు సాయం చేసేందుకు ప్లాంట్ బాక్స్ అనే సెల్ఫ్ ఇరిగేషన్ బాక్స్ రూపొందించాడు.
నీటి సమస్యకు చెక్
రాహుల్.. విస్తృత అధ్యయనం తరువాత ఈ ప్లాంట్ బాక్స్ రూపొందించాడు. మొక్కలు నాటేటప్పుడు 5 లీటర్ల నీరు పట్టే ఈ బాక్స్ అమర్చేలా తయారుచేశాడు. ఒక్కసారి నీటిని పోస్తే నెల రోజుల వరకూ మళ్లీ నీరు పోయాక్కర్లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు..రాహుల్. హరితహారం, వనం మనం కార్యక్రమాలకు ఎదురవుతున్న నీటి సమస్యకు తన ఆవిష్కరణతో చక్కని పరిష్కారం చూపాడు.
సమయం ఆదా
మెుక్కలకు అవసరమైన నీరు అందించటమే కాక విలువైన సమయం ఆదా చేసేలా తయారు చేసిన ప్లాంట్ బాక్స్ వినియోగానికి రైతులు సహా అన్నివర్గాల వారు ఆసక్తి చూపిస్తున్నారు. వర్షాభావ సమస్య ఉన్న ప్రాంతాల్లోని పండ్ల తోటల పెంపకానికి చక్కగా ఉపయోగపడుతుందంటున్నాడు.. రాహుల్ . రోడ్లపై నాటే మొక్కలు, ఇంటి పెరట్లోని కూరగాయలు, పండ్లు, పూల మొక్కల సంరక్షణకు దోహదపడుతుందంటున్నాడు.
ప్లాంట్ బాక్స్
ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ వర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ చేసిన రాహుల్..అక్కడే రెండేళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అయితే ఆరంకెల వేతనం, విలాసవంతమైన జీవితం అతడికి సంతృప్తి ఇవ్వలేదు. స్వదేశం వచ్చి రైతులకు సేవ చేయాలకున్నాడు. వెంటనే భారత్ వచ్చి సరి కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాడు. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి ప్లాంట్ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చాడు.