కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కొద్దిపాటి లక్షణాలు కనపడగానే హైరానా పడుతున్నారు. వెంటనే ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రయత్నించడం, అంత అవసరం లేకపోయినా రెమెడిసివర్ లాంటి ఔషధాలు, ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నానావిధాల ప్రయత్నిస్తున్నారు. నేతలకు వస్తున్న విజ్ఞప్తులలో అధికంగా ఈ తరహావే ఉంటున్నాయి. కొవిడ్ వైరస్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధాలు, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ప్లాస్మా కోసం పలువురు మంత్రి కేటీఆర్, మంత్రి ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు, అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.
ముందు జాగ్రత్తతో…
నిత్యం ఇటువంటి వినతులు ఎన్నో వస్తున్నాయి. కొద్ది పాటి లక్షణాలు కనిపించగానే... ఆసుపత్రుల్లో పడకలు కావాలని పలువురు కోరుతున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి స్వల్ప లక్షణాలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఇళ్లలోనే ఐసోలేషన్ లో ఉండడం లేదా కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లడం మంచిదని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా పలువురు కొద్దిపాటి లక్షణాలు కనిపించగానే పెద్దాసుపత్రుల్లో పడకలు కావాలని పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైరస్ తీవ్రత అధికంగా ఉండి ఆసుపత్రిలో, ఐసీయూలో చికిత్స అవసరం ఉన్న వారికి సకాలంలో పడకలు లభించే అవకాశాలు పోతోంది. అటు రెమిడిసివర్ సహా ఇతర ఔషధాల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిపాటి లక్షణాలు కనిపించగానే అవసరం వస్తుందేమోనన్న ఉద్దేశంతో అటువంటి ఔషధాలను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆక్సిజన్‌కు సంబంధించి కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్లు ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా, కొద్ది పాటి లక్షణాలు కనిపించగానే ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నారు. వస్తున్న విజ్ఞప్తులలో అత్యవసరాలకు సంబంధించినవి ఉంటున్నాయని, వాటిపై స్పందించి వీలైనంత త్వరగా సమకూరుస్తున్నామని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
ప్రాణవాయువుకై విజ్ఞప్తులు
అయితే కొన్ని సందర్భాల్లో పలువురు భయాందోళనలకు లోనై అసవరం లేకపోయినా ఔషధాలు, ఆక్సిజన్ లాంటి వాటి కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. తీరా మొత్తం వివరాలు తెలుసుకున్నాక వారికి అంత అత్యవసరం కావని తేలుతోంది. దీంతో ఆ క్షణానికి అత్యవసరం అయ్యే వారికి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దిపాటి లక్షణాలు కనిపించగానే భయాందోళనలకు లోనుకాకుండా వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రచారం జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలని అంటున్నారు. అత్యవసర సమయాల్లా కచ్చితంగా స్పందించి వీలైనంత త్వరగా తగిన సాయం చేస్తామని చెప్తున్నారు.