తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంధకార జీవితాన్ని... అతడు అందంగా మలిచాడు'

దేశానికి కాపలా కాయాల్సిన సైనికుడు.. తన ప్రేమను కాదన్న యువతిపై... యాసిడ్‌తో దాడి చేసి మరీ పగ తీర్చుకున్నాడు. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు కంటిచూపును 90 శాతానికిపైగా కోల్పోయినా.. ఐదేళ్లపాటు పోరాడి జీవితాన్ని గెలిచింది. మనసుకు నచ్చినవాడిని మనువాడింది. ఆమే... ఒడిశాకు చెందిన 29 ఏళ్ల ప్రమోదిని.

story on Acid attack victim 29-year-old Pramod from Odisha
'అంధకార జీవితాన్ని... అతడు అందంగా మలిచాడు'

By

Published : Mar 5, 2021, 12:13 PM IST

రగతులు ప్రారంభమయ్యేలోపు కాలేజీకి వెళ్లాలని వడివడిగా నడుస్తోంది ప్రమోదిని. ఒడిశాలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లాలో ఇంటర్‌ కాలేజీలో ఒకే ఒక విద్యార్థిని ఆమె. ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి మరీ కాలేజీలో చేరింది. కళాశాల ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న ఆమెకు ఎదురుపడ్డాడో వ్యక్తి. అతడిని గుర్తించింది. చాలారోజులుగా ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. ఆ రోజు కూడా అతడి నుంచి తప్పించుకోవాలనుకుని వేగంగా అడుగులేసింది. అయితే అతడి బలం ముందు ఓడిపోయింది. అడ్డు నిలబడిన అతడి చేతిలోని సీసా నుంచి యాసిడ్‌ ముఖంపై పడేవరకు తనకేం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. క్షణాల్లో అంతా జరిగిపోయింది. మండుతున్న ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడుస్తూ కిందపడిపోయింది. ఆ రోజు జరిగిన యాసిడ్‌ దాడిలో ముఖంతోసహా చేతులు, భుజాలు దాదాపు 80 శాతానికి పైగా కాలిపోయిన ఆమెను కటక్‌ ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

ఐదేళ్లపాటు మంచంలోనే

ఆసుపత్రిలో ఏడు నెలలు ప్రమోదినికి చికిత్స జరిగింది. రెండు కళ్లూ దెబ్బతినడంతో దాదాపు కంటిచూపు కరవైంది. కొంతైనా చూపు తెప్పించాలనుకున్నారు వైద్యులు. వారి ప్రయత్నం ఫలించి, పాక్షికంగా ఆమెకు ఓ కన్ను కనిపించేలా చేయగలిగారు. ఓవైపు చికిత్స తీసుకుంటున్నా, జీవితంపై విరక్తితో మానసికంగానూ కుంగిపోయింది. ఆ సమయంలోనే ఆమెకు చేయూతనందించాడు సరోజ్‌ సాహు. భవిష్యత్తు అంధకారమైందని, జీవితమంతా చీకటే.. అనుకుంటున్నప్పుడు సరోజ్‌ తనకు భరోసా ఇచ్చాడని చెబుతోంది ప్రమోదిని. ‘2009లో నాపై యాసిడ్‌ దాడి జరిగింది. ఆ సంఘటన తర్వాత నిద్రలో కూడా ఉలిక్కిపడి భయంతో లేచేదాన్ని. నా మనసులో నుంచి ఆ రోజును చెరపలేకపోయేదాన్ని. కొంతవరకు చికిత్స చేశాక ఇంటికి చేరుకున్నా. ఆ తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమయ్యా. అలా ఐదేళ్లపాటు చీకట్లోనే గడిపా. తిరిగి అనారోగ్యం పాలవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో 2016లో సరోజ్‌ నన్ను కలిశాడు. నిరాశలోకి జారిన నన్ను తిరిగి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. నాలో మనోధైర్యాన్ని నింపాడు. జీవితమంటే ఎక్కడో ఓచోట ఆగిపోకూడదు, ముందుకు సాగుతూనే ఉండాలని చెప్పేవాడు. నరకంలో ఉన్న నాకు వెలుగు చూపించాడు. తన జీవితభాగస్వామిగా రావాలని నన్ను అడిగినప్పుడు ముందు నన్ను నేను నమ్మలేకపోయా. కలా నిజమా అనుకున్నా. మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిన తర్వాతే తను ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. చాలా ఆలోచించి చివరకు సరేనన్నా. ఆ తర్వాత మా కుటుంబాన్ని ఒప్పించాడు. ప్రేమికుల రోజే మా నిశ్చితార్థం జరిగింది. నాలాంటి యాసిడ్‌ బాధితులందరూ వచ్చి పెద్ద వేడుకగా జరిపారు. ఇటీవలే మా ఇంటి దగ్గరే పెళ్లి జరిగింది. వివాహ వేదికపై ఒడిశా గవర్నరు గనేషిలాల్‌, రాష్ట్ర విద్యాశాఖామంత్రి సమీర్‌ దాష్‌ వంటి ప్రముఖులు దంపతులైన మా ఇద్దరికి అభినందనలు చెప్పి ఆశ్వీరదిస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోయింది. తను మంచి కేర్‌టేకర్‌, స్నేహితుడు ఆ తర్వాతే జీవిత భాగస్వామి. ఇంతకాలం నా జీవితం ఏమవుతుందో అని ఆందోళనపడిన అమ్మ కళ్లల్లో ఇప్పుడు ఆనందాన్ని చూస్తున్నా. ఎలాంటి దుర్ఘటనలెదురైనా, వాటినెదిరించి పోరాడి గెలవొచ్చనే సరోజ్‌ మాటలు నాలాంటి వారందరిలో స్ఫూర్తిని నింపుతాయని ఆశిస్తున్నా. అలాంటి వారందరికీ నేను ఓ ఉదాహరణ అనుకుంటున్నా’ అని చెబుతోంది ప్రమోదిని.

సంబంధిత కథనం: చిరకాల మిత్రుడితో యాసిడ్ దాడి​ బాధితురాలి పెళ్లి

ABOUT THE AUTHOR

...view details