మాఘ బహుళ చతుర్దశినాడు వచ్చేదే మహాశివరాత్రి. శివపార్వతుల కళ్యాణం జరిగిన శుభదినం. దీనికి మరో విశిష్టతా ఉంది. ఆనాటి అర్ధరాత్రి సమయంలోనే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడనేది శివపురాణ కథనం. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి లింగరూపంలో అర్చిస్తుంటారు భక్తులు. అయితే ఆ లింగాలన్నింటిలోకీ నర్మదానదిలో లభ్యమయ్యే బాణలింగాలు శక్తిమంతమైనవనీ, పాపాలను పోగొడతాయనీ, కోటి శివలింగాల్ని అర్చించినా దొరకని పుణ్యం ఒక్క బాణలింగాన్ని పూజిస్తే లభిస్తుందనీ యాజ్ఞవల్క్యసంహిత పేర్కొంటోంది.
బాణాసురుడు పరమ శివభక్తుడు. మహా తపస్సంపన్నుడు. ప్రహ్లాదుడి మనుమడు. శివునికై నర్మదా నదీతీరంలో కఠోర తపస్సు చేసి, ఆయన్ని ప్రసన్నం చేసుకుని, లింగ రూపంలో తపోభూమిలో ఉండమని కోరాడట. ఆ వర ప్రభావంవల్ల నర్మదానదిలో ఉద్భవించిన లింగాలే బాణలింగాలు... భక్తులకు కైవల్యాన్ని ప్రసాదించడానికి సదాశివుడు భువిపై అవతరించిన శిలారూపాలు.
తాంత్రిక లింగం!
శివుడు కాలరుద్రుడై నర్తించే సమయంలో ఆయన శరీరం నుంచి రాలిపడ్డ స్వేదమే నర్మదా నదిగా మారి ప్రవహించిందనీ ఆ నదిలో దొరికే రాళ్లు శివుడికి ప్రతిరూపాలని వాయు, స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. నర్మదానదిని శంకరుడి పుత్రి అన్న అర్థంలో శంకరీ అనీ పిలుస్తుంటారు.
కోలాకారంలో నున్నగా మెరుస్తూ నదిలో లభ్యమయ్యే ఈ లింగాలనే తాంత్రిక లింగాలనీ పిలుస్తారు. శివ, శక్తి రూపాల కలయికతో ఏర్పడినవిగా భావించి సాధువులు తాంత్రిక శక్తుల్లోనే కాదు, నాడులూ రక్తనాళాల్లోని అవరోధాల్ని తొలగించేందుకూ వీటిని ఉపయోగిస్తారు. ఈ లింగం వ్యతిరేక శక్తుల్ని పోగొడుతుందనీ, శరీరంలోని శక్తిచక్రాలను ప్రేరేపించి వ్యాధుల్ని తగ్గి స్తుందనీ చెబుతారు. బాణలింగాలు గులకరాళ్లు కావనీ, ఐరన్ ఆక్సైడ్, జియోథైట్, బసాల్ట్, ఎగేట్ కలిసిన క్రిప్టోక్రిస్టలైన్ క్వార్ట్జ్‌అనే అరుదైన రత్నాలనీ, కోటీ 40 లక్షల సంవత్సరాల క్రితం ఉల్క ఏదో రాలిపడి, ఇక్కడి మట్టీ నీటితో కలిసి అరుదైన సమ్మేళనంగా రూపొంది ఉంటుందనీ, అందుకే ఇవి దృఢమైనవీ శక్తిమంతమైనవీ అంటారు జియాలజిస్టులు.