Irrigation projects: ఆర్థిక సంస్థలు రుణాలను నిలిపివేయడం, రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల పనులపై పడింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, వరదకాలువ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ బ్యారేజి ప్రాజెక్టుల పనులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొంది. నాలుగేళ్లుగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందినా, గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో పనులు, బిల్లుల చెల్లింపులు, భూసేకరణ, పునరావాసం..ఇలా అన్నింటికీ ఇబ్బందికరంగా మారింది.
నెలకు వెచ్చిస్తోంది రూ.350 కోట్లే:2022-23వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.9,197 కోట్లతో పాటు రుణాలతో కలిపి సుమారు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా సరాసరిన నెలకు రూ.రెండువేల కోట్లకు పైగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ ఆఖరు వరకు మూడునెలల్లో చెల్లించింది రూ.1,050 కోట్లు మాత్రమే.
వీటిలో రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చినవి రూ.563 కోట్లు కాగా, బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నవి రూ.487 కోట్లు. అంటే సగటున వెచ్చించింది నెలకు రూ.350 కోట్లు మాత్రమే. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్.ఇ.సి), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పి.ఎఫ్.సి)లు ఒప్పందం చేసుకొన్న మేరకు రుణాలు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఒప్పందాలను ఉల్లంఘించి రుణాలు విడుదల చేయని సంస్థలపై న్యాయపోరాటాన్ని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
అత్యధికం కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల్లోనే:కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మొదట కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు వివిధ బ్యాంకులతో కూడిన కన్సార్షియం ద్వారా రుణాలు విడుదలయ్యాయి. సుమారు రూ.58 వేల కోట్ల అప్పు తీసుకొన్నారు. తిరిగి చెల్లింపు కూడా ప్రారంభమైంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు ఆర్.ఇ.సి, పి.ఎఫ్.సి సంస్థలు సుమారు రూ.30 వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పాలమూరు-రంగారెడ్డికి సుమారు రూ.ఆరువేల కోట్లకు పైగా అప్పు ఇచ్చాయి.
దీంతో పాటు కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి కూడా అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి నిధులు ఆగిపోయాయి. ఈ రెండు సంస్థల నుంచే ఒప్పందం చేసుకొన్న మొత్తంలో సుమారు రూ.20 వేల కోట్లకు పైగా రావలసి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, శ్రీరామసాగర్ వరద కాలువ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ బ్యారేజీలకు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొన్నారు.