దక్షిణ భారత దేశంలోనే అత్యధిక నిర్మాణాలు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ. అందులోనూ హైదరాబాద్ శరవేగంగా విస్తరించుకుంటూ పోతోంది. నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో ఉంది. దీనిపై దాదాపు 250 రంగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20లక్షల మంది నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. తొమ్మిది, పది రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలసకూలీలు వస్తుంటారు. ఇటుక బట్టీల దగ్గర నుంచి సిమెంటు దుకాణాలు, ఇసుక తరలింపు, గోడకట్టే దగ్గర నుంచి అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డెకరేషన్ వరకు అన్ని విభాగాల్లోనూ వలసకార్మికుల పాత్ర కీలకంగా ఉంటుంది.
లాక్‌డౌన్ నేపథ్యంలో చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక... వలసకార్మికులు... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవలే కేంద్రం ఆదేశాలతో... రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్వస్థలాలకు పయనమవుతున్నారు. 80శాతానికిపైగా వలస కూలీలతోనే రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు వారే లేకపోతే... నిర్మాణ రంగం ముందుకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.