తెలంగాణ

telangana

ETV Bharat / state

అవయవ మార్పిడికీ తప్పని అంతరాయం! - అవయవ మార్పిడికీ తప్పని అంతరాయం!

అన్ని రకాల వైద్య సేవలపై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలను నిలిపివేశారు. ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీల ద్వారానే సేవలు అందిస్తున్నారు. కొందరు వైద్యులు వీడియో కాల్‌ ద్వారా రోగుల లక్షణాలు బట్టి చికిత్స చేస్తున్నారు. తాజాగా కోవిడ్‌-19 ప్రభావంతో అవయవ మార్పిడి చికిత్సలు ఆగిపోయాయి.

stop organs transplantation in telangana
అవయవ మార్పిడికీ తప్పని అంతరాయం!

By

Published : Apr 4, 2020, 8:29 AM IST

కరోనా ప్రభావం అవయవ మార్పిడి చికిత్సలపై పడింది. వైరస్‌ తగ్గేవరకు అవయవ మార్పిడి చికిత్సలు కష్టమేనని తెలంగాణ రాష్ట్ర జీవన్‌దాన్‌ ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. అత్యవసర కేసుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బాధితులు ఔషధాలతో ఏదోలా నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌తో పాటు ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులన్నీ అవయవ మార్పిడి చికిత్సలు అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ ద్వారా

ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, గుండె, క్లోమగ్రంథి, ఊపిరితిత్తులు, గుండెవాల్వుల మార్పిడి చికిత్స చేస్తున్నారు. విదేశీయులూ హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందుతుంటారు. తక్కువ ఖర్చుతో పాటు నిపుణులు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను నిమ్స్‌ ఆధ్వర్యంలోని జీవన్‌దాన్‌ ట్రస్టు పర్యవేక్షిస్తుంది. ఆసుపత్రులన్ని ఈ ట్రస్టు కింద రిజిస్టరై ఉంటాయి. బాధితులు సైతం ఈ ట్రస్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా వారికి దాతలు ఇచ్చే అవయవాలను కేటాయిస్తారు.

చివరిగా.. మార్చి 19న

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జీవన్మృతి(బ్రెయిన్‌డెడ్‌) అయినవారు ఉంటే.. తొలుత జీవన్‌దాన్‌ ట్రస్టుకు సమాచారమిస్తారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో ట్రస్టు సభ్యులు మాట్లాడి వారి ఇష్టం మేరకు అవయవాల దానానికి అంగీకరించేలా కృషి చేస్తుంటారు. బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తులే కాకుండా.. లైవ్‌ డోనర్లు కూడా ముందుకొచ్చి దానం చేస్తుంటారు. వీరు బాధితులకు కుటుంబ సభ్యులు. ప్రధానంగా కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు లైవ్‌ డోనర్ల ద్వారా జరుగుతుంటాయి.

7481 మంది అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు

నగరంలో నెలకు పది వరకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తుంటారు. చివరిసారిగా మార్చి 19న జీవన్మృతి అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించారు. ఆ తర్వాత కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడంతో ఈ శస్త్రచికిత్సలు నిలిపివేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7481 మంది అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మూత్రపిండాలు, కాలేయ రోగులే ఎక్కువ మంది. కొందరికి రోజుల వ్యవధిలో మార్పిడి అవసరం. అయినా ఔషధాలు, డయాలసిస్‌తో నెట్టుకొస్తున్నారు. చికిత్సలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి.

కరోనా నేపథ్యంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఇప్పట్లో కష్టమే. ఎంపిక చేసిన లేదా లైవ్‌ డోనర్‌ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. అత్యవసర పరిస్థితి ఉన్నవారికి చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత దాత, గ్రహీతలకు కరోనా పరీక్షలు చేయాలి. ఇద్దరిలోనూ నెగెటివ్‌ రావాలి. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయడం కష్టమవుతోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోవాలి. అవయవ మార్పిడి చికిత్సలు అంటే.. 10-15 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. ఈలోపు రోగులకు వైరస్‌ సోకితే ఇంకా ప్రమాదం. ప్రత్యేక కేసుల్లో ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు ముందుకు సాగవచ్చు.

-డాక్టర్‌ జి.స్వర్ణలత, జీవన్‌దాన్‌ ట్రస్టు, నిమ్స్‌ ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details