రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 1 లక్ష 63 వేల 169 మందికి టీకాలు అందించినట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గత వారంలో ఏకంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో రెండు లక్షల మందికి పైగా టీకాలు ఇచ్చారు. ఇక తాజాగా ఇచ్చిన టీకాలతో కలిపి ఇప్పటివరకు 83 లక్షల 29వేల 332 మందికి వ్యాక్సిన్ అందించినట్టు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల మందికి పైగా టీకా తీసుకునేందుకు అర్హులుగా ఉన్నట్లు గతంలోనే సర్కారు ప్రకటించింది. అందులో ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం 35,247 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు.
నాలుగైదు నెలల్లోనే పూర్తి!...
ప్రభుత్వం ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమందికి తక్కువ సమయంలో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 850కి పైగా కేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపట్టింది. ఫలితంగా నిత్యం లక్షన్నర మంది వరకు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే నాలుగైదు నెల్లలోనే దాదాపు అర్హులైన వారికి టీకాలు అందించే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.
మొదట్లో నత్తనడకన వ్యాక్సినేషన్...
మరోవైపు ఈ ఏడాది జనవరి 16 నుంచి రాష్ట్రంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. కాగా... టీకాల అందుబాటు... కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగినట్టు అధికారిక లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. జనవరిలో కేవలం హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన సర్కారు... నెలాఖరు నాటికి కేవలం 1లక్ష 66 వేల 26 మందికి మాత్రమే టీకాలు ఇచ్చింది. ఇక ఫిబ్రవరిలో హెల్త్ కేర్ వర్కర్లతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పై బడిన వారికి టీకాలు ప్రారంభించిన ప్రభుత్వం... మొత్తంగా 2లక్షల 82వేల 89మందికి టీకాలు ఇచ్చింది. అంటే రోజుకి సగటున పది వేల మందికి మాత్రమే టీకాలు అందించింది.