AP Employees Protest: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఏలూరు జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని... మూడు డీఏల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లకోసారి వేతన సవరణ చేపట్టాలని నినదించారు.
ధర్మ పోరాట రిలే దీక్షలు..
అనంతపురం జిల్లా మడకశిరలో విద్యుత్ ఉద్యోగులు.. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. కడపలో విద్యుత్ భవన్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మడకశిర తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు నిరసన దీక్షకు దిగారు. ఆ తర్వాత తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. వీఆర్‌ఏల కనీస వేతనాన్ని 21వేలకు పెంచాలని... తమకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని నినాదాలు చేశారు.