తెలంగాణ

telangana

ETV Bharat / state

"సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..! - telangana cabinet Meeting Updates

పట్టణం రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈనెల 24 నుంచి పదిరోజుల పాటు పట్టణ ప్రగతి అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని విధివిధానాల ఖరారు కోసం రేపు ప్రగతిభవన్ వేదికగా రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలం, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేని రుణాలు వంటి పథకాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

State should appeal to the Center ..
"సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..!

By

Published : Feb 17, 2020, 5:10 AM IST

Updated : Feb 17, 2020, 7:33 AM IST

"సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..!

హైదరాబాద్​ ప్రగతిభవన్ వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగింది. ఈనెల 24 నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కార్యక్రమ విధివిధానాల ఖరారు కోసం ప్రగతి భవన్‌ వేదికగా మంగళవారం పురపాలక సదస్సు జరగనుంది. సదస్సులో మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, కమిషనర్లు, శాసనసభ్యులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొంటారు. పట్టణప్రగతిపై సదస్సులో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తారు.

గ్రేటర్​కు 78 కోట్లు.. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు 70 కోట్లు

వార్డు యూనిట్‌గా పట్టణప్రగతి సాగాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి వార్డుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని సూచించారు. నగర, పురపాలక సంస్థల్లో వార్డుల వారిగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియను వచ్చే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు 78 కోట్లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 70 కోట్ల చొప్పున వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు 148 కోట్ల రూపాయలు సమకూరుతాయన్న సీఎం... పట్టణ ప్రగతి పనులకు నిధుల కొరత ఉండబోదన్నారు.

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత

పట్టణ ప్రగతిలో పచ్చదనం, పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యమివ్వాలని, మురుగు కాలువలు శుభ్రం చేయడంతోపాటు మురికి గుంతలు పూడ్చాలని తెలిపారు. హరిత ప్రణాళిక రూపొందించి విరివిగా మొక్కలు నాటడంతో పాటు వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని చెప్పారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలం..?

రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారు తల్లి, వడ్డీలేని రుణాలు తదితర పథకాల పరిస్థితిని అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించిన కేబినెట్ విధివిధానాల ఖరారు కోసం గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీ వేశారు.

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ రాష్ట్ర - మంత్రిమండలి నిర్ణయాలు

  1. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి నిర్వహించాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించాలి. వార్డుల వారీగా ప్రజాసంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే అయిదు రోజుల్లో పూర్తి కావాలి.
  2. జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పురపాలక సంఘాలకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ఆర్థిక సంఘ నిధుల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
  3. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. దీనివల్ల అన్ని పట్టణాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి.
  4. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ. 811 కోట్లలో రూ.500 కోట్లు నగరపాలక, పురపాలక సంఘాలకు, రూ.311 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించాలి. పట్టణ ప్రగతిలో పచ్చదనం - పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యమివ్వాలి.
  5. మురుగు కాల్వలు శుభ్రం చేయాలి. గుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
  6. నగర, పురపాలికల్లో పారిశుద్ధ్య పనులకు 3100 వాహనాలు సమకూర్చాలి. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగిలిన వాటిని త్వరగా రప్పించాలి. మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. శ్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలి. పట్టణాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంబించాలి.
  7. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
  8. కొత్త రెవెన్యూ చట్టం, నీటిపారుదల వ్యవస్థ పునర్య్వవస్థీకరణ, కొత్త ప్రవాస విధానం తదితర అంశాలపై చర్చించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు.

ఇవీ చూడండి:సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం

Last Updated : Feb 17, 2020, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details