ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కరోనా వైరస్‌పై అప్రమత్తమైన రవాణా శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఆర్టీఏ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకై అధికారులు అవగాహన కల్పించేలా పోస్టర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయాలతో పాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లపై కరోనా వైరస్ జాగ్రత్తలపై పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
అవగాహనపై అధికారులకు దిశా నిర్దేశం:
ఈ అవగాహన పోస్టర్లను వివిధ వాహనాలకు అతికిస్తూ వాహనదారులను చైతన్యపరిచే కార్యక్రమం హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం. రావు పాల్గొని కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. కరోనా వైరస్ నియంత్రణకై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై, ప్రజలకు కల్పించాల్సిన అవగాహనపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని పోస్టర్లతో విస్తృతంగా అవగాహనను కల్పించాలని ఆదేశించారు.