Vinodkumar On Banks Strike : బ్యాంకర్ల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రకటించారు. అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ బ్యాంకులను కట్టబెట్టేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో జరుగుతున్న బ్యాంకర్ల సమ్మెలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా మద్దతు ప్రకటించారు. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకులను జాతీయకరణ చేయగా... మన్మోహన్ సింగ్ హయాంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను కొంతదెబ్బతీశారని విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు.
బ్యాంకు సమ్మెపై సామాజిక మాధ్యమాల్లో భాజపా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎక్కడ బ్యాంకు అమెండ్‌మెంట్ చట్టం బిల్లు వచ్చినా తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, బ్యాంకర్ల సమ్మెకు తెరాస పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యాంకులు జాతీయ చేయడం వల్లనే దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు.