Vinod Kumar allegations on BJP: రాజ్యాంగం, పనితీరును సమీక్షించేందుకు వాజ్ పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని... రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలతో చర్చించకుండా నదుల అనుసంధానం చేపడతామని బడ్జెట్లో ఎలా చెబుతారని వినోద్ ప్రశ్నించారు. గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్న ఆయన... అనుసంధానం కోసం డీపీఆర్ తయారు అయిందనడాన్ని కొట్టి పారేశారు.
ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నం
ప్రధానమంత్రికి కొన్ని అంశాలపై మాత్రమే అధికారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారని తెలిపారు. హైదరాబాద్లోని ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని... హైదరాబాద్ ప్రజలు దీన్ని గుర్తించాలని సూచించారు. భాజపాను ఉత్తర భారతదేశ పార్టీగా వినోద్ కుమార్ అభివర్ణించారు. రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని... మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగాలని, ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా చెప్పారని వినోద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల పాత్రపై చర్చ జరగాల్సి ఉందన్న ఆయన.... గవర్నర్లు నేరుగా దరఖాస్తులు తీసుకుంటున్నారని, మమతా బెనర్జీపై పశ్చిమ బంగ గవర్నర్ ట్వీట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.