అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లోనే 'దళిత బంధు' పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ పథకం ఇప్పుడు ప్రకటించింది కాదని ఇదివరకే రూ.1000 కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు. ఇవాళ రవీంద్రభారతిలో జరిగిన సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా వ్యూహ రచన చేస్తున్నట్లు వివరించారు.
దళితుల విస్తృతమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం 'దళిత బంధు' పథకాన్ని రూపకల్పన చేసినట్లు వినోద్ కుమార్ వివరించారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రూ. వెయ్యి కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినట్లే అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదని స్పష్టం చేశారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ఎస్సీల అభ్యున్నతిని కాంక్షించే తెచ్చిన పథకంగా చూడాలన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ఈ పథకం అమలులో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. " రైతు బంధు'' పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించినట్లే.. ఈ పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిదని.. స్వరాష్ట్రం సిద్దించిన తరువాత సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.