చేనేత పరిశ్రమకు పూర్తి జవసత్వాలు అందించి మరింత చేయూతను ఇచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో... మేక్ ఇన్ ఇండియా అప్రోచ్ ఫర్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, ద గ్లోబల్ పర్స్పెక్టివ్ అనే అంశంపై జరిగిన జాతీయ వేబినార్‌లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా దిల్లీ నుంచి పాల్గొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వినోద్ కుమార్ తెలిపారు. చేనేత కార్మికులు నైపుణ్య పరంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హ్యాండ్లూమ్స్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, చేనేత కార్మికులు చేతి నిండా పనితో సుభిక్షంగా ఉన్నారన్నారు.