రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొని.. బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంఘ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.
ప్రణాళికలు సిద్ధం
సీఎం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు హెయిర్ కటింగ్ షాపులకు ఉచిత కరెంటు వంటి హామీలు నెరవేర్చడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. వెనకబడిన కులాల వారి సంక్షేమం కోసం ప్రతి కులం నుంచి పది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.