రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్(ఈ-నామ్) పథకం అమలుతీరు అధ్వానంగా మారింది. రాష్ట్రంలోని 57 వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్ (E-NAM) వేదికలో ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వీటిలో పంటలను కొనేందుకు 5 వేల మందికి పైగా వ్యాపారులకు లైసెన్సులు జారీ చేశారు. అయితే.. ఒక మార్కెట్‌కు వచ్చిన పంటలను మరో ప్రాంతంలో ఉన్నవారు కొనేందుకు ఆన్‌లైన్ ఏర్పాట్లు పక్కాగా లేవు. దీంతో.. వ్యాపారులు ఈ-నామ్ (E-NAM) పరిధిలోని 57 మార్కెట్లకు వచ్చిన పంటలన్నింటిని ఆన్‌లైన్‌లో కొనకుండా ఒకటీ రెండు పంటలనే కొంటున్నారు.
రైతులకు ఆదాయం పెరగడం లేదు
దేశంలోని ఎక్కడి నుంచైనా, ఎవరైనా పంటను చూసి కొనుగోలు చేయడానికే కేంద్రం ఈ-నామ్ పథకాన్ని (E-NAM SCEAME) ప్రవేశపెట్టింది. 2016లో ఈ పథకం ప్రారంభమైనా.. దేశంలో ఎక్కడి నుంచైనా పంటలు కొనుగోలు చేసే విధానం నేటికీ అందుబాటులోకి రాలేదు. ఒక మార్కెట్‌లో ఈ-నామ్ (E-NAM) పెట్టి అక్కడి వ్యాపారులనే ఆన్‌లైన్‌లో ధరలు కోట్ చేయమంటున్నారు. దీనివల్ల వారంతా ముందుగానే సిండికేట్‌గా మారి ఆన్‌లైన్‌లో ఎవరి ధరను వారు కోట్ చేస్తున్నారు. దీనివల్ల పంటలకు ధరలు, రైతులకు ఆదాయం పెరగడం లేదు. ఆన్‌లైన్ ఏర్పాట్లు లేకపోవడంతో రాష్ట్రంలో ఈ పథకం పక్కగా అమలుకావడం లేదు.
అదనంగా 43 పెంచాలని యోచన
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మార్కెట్లన్నీ మూసేయడంతో ఈ-నామ్ (E-NAM) ఉన్నా ఫలితం లేకుండా పోయింది. విపత్తుల వేళ ఉపయోగపడే ఈ పథకాన్ని ఇప్పుడు కూడా అమలుచేయకపోతే ఇంకేం ప్రయోజనమని రైతులు వాపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఈ-నామ్ (E-NAM) మార్కెట్లలో గత మూడేళ్లలో 18.33 లక్షల మంది రైతులే పంటలు విక్రయించారంటే వీటి పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఈ పథకం కింద తెలంగాణలోని మరో 43 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ యోచిస్తోంది. ఇదివరకు అనుసంధానించిన 57 మార్కెట్లలోనే పూర్తిస్థాయి ఆన్‌లైన్ సదుపాయం లేక కొనుగోళ్లు సక్రమంగా జరగకపోగా.. కొత్తగా దీని పరిధిలోకి తీసుకొచ్చే మార్కెట్లలో వ్యాపారం ఎలా కొనసాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ల సంఖ్యను పెంచినంత మాత్రాన ఉపయోగం ఉండదని, ప్రతీ మార్కెట్‌లో పంటల నాణ్యతను గుర్తించే ప్రయోగశాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు కల్పన, దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసేలా ఆన్‌లైన్ ఏర్పాట్లు చేస్తేనే రైతులకు ప్రయోజనకరమని ఓ టోకు వ్యాపారి తెలిపారు. మరోవైపు.. ఈ-నామ్ పోర్టల్ (E-NAM PORTAL)లో తెలంగాణకు సంబంధించిన పంటల కొనుగోలు వివరాలు కనిపించకపోవడం గమనార్హం.
ప్రత్యేక అభివృద్ధి కోసం 6 మార్కెట్ల ఎంపిక
దేశంలో బాగా వెనుకబడిన జిల్లాల్లోని కొన్ని వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్ (E-NAM) కింద ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా నిర్ణయించింది. దీనికోసం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఇచ్చోడ, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, ఏన్కూరు, వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట, పరకాల మార్కెట్లను ఎంపిక చేసింది. ఈ ఆరు మార్కెట్లలో పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ఇదీ చూడండి:విపత్తులోనూ ఆదుకోని ఈ-నామ్