రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) 2021-22 సంవత్సరానికి రూ.1,86,035 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించింది. సోమవారం బీఆర్కే భవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ రుణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఏడాది పంట రుణాలను ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు కలిపి రూ.41,200 కోట్లు అందజేసినట్లు బ్యాంకర్లు ఈ సందర్భంగా తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు దీర్ఘకాలిక రుణాలను రూ.16,816 కోట్లు, విద్య రుణాలు రూ.693 కోట్లు, గృహ రుణాలు రూ.4162 కోట్లు అందజేసినట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లక్ష్యం కంటే తొమ్మిదిశాతం ఎక్కువగా రూ.38416 కోట్లు, ముద్ర రుణాలు రూ6445 కోట్లు అందించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ అభియాన్ కింద రూ.7080 కోట్లను మంజూరు చేయగా రూ.5969 కోట్లు అందజేశామన్నారు. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి కింద 3,10,145 మందికి రుణాలు అందజేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు.
రైతుబంధు నిధులు రూ.281 కోట్లు రుణాలకు సర్దుబాటు
వానాకాలం రైతుబంధుకు సంబంధించి బ్యాంకులకు విడుదల చేసిన మొత్తంలో రూ.281 కోట్లను రైతులకు సంబంధించిన రుణాలకు సర్దుబాటు చేయడమో, ఆపడమో చేసినట్లు బాంకర్లు తెలిపారు. వడ్డీలేని రుణాలు, పావలావడ్డీ రుణాలకు సంబంధించి 2014వ సంవత్సరం నుంచి అన్ని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.725 కోట్లను విడుదల చేయాల్సి ఉందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.