రాష్ట్రంలోని సహకార సంఘాల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో రూ.7 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఏడాది కింద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఏలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మెదక్ జిల్లా కోనాపుర్ సహకార సంఘంలో దాదాపు రూ.3 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఆ సహకార సంఘం సభ్యుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భర్త ఛైర్మన్‌గా ఉన్న కోనాపుర్ సహకార సంఘంలో అవినీతి జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
సహకార సంఘాల్లో అడ్డగోలుగా అవినీతి: అన్వేష్ రెడ్డి - తెలంగాణ వార్తలు
సహకార సంఘాల్లో అవినీతి జరుగుతోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆరోపించారు. ఏటా సహకార సంఘాల్లో ఆడిట్ సక్రమంగా జరగట్లేదని ఆయన మండిపడ్డారు. జిల్లా కో-ఆపరేటివ్ అధికారులూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలోని ఒక సహకార సంఘంలో డిపాజిట్లు రైతులకు ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయని ఆరోపించారు. ఏటా సహకార సంఘాల్లో ఆడిట్ జరుగుతున్నా... తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఈ తప్పులు జరిగాయన్నారు. జిల్లా కో-ఆపరేటివ్ అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, మెదక్, కోనాపుర్, నిజామాబాద్ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలకు ఆడిట్ అధికారులను ఎందుకు బాధ్యులుగా చేయరని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కోనాపుర్ సహకార సంఘంలో వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల