కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై బుధవారం సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం గురవారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ఐపీఎం సంచాలకుడు డాక్టర్ శంకర్ హైకోర్టుకు హాజరై.. ప్రభుత్వ చర్యలను వివరించారు. ప్రభుత్వం అన్ని విధాల పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రస్తుతం గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స వసతులు ఉన్నాయని.. మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండంలో కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బందికి సోకకుండా పర్సనల్ ప్రివెంటివ్ ఎక్విప్ మెంట్ సమకూర్చినట్లు శంకర్ తెలిపారు.
ఉచితంగా మాస్క్‌లు, సెన్సిటైజర్లు..!
కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉన్నందున వాటికి సమీపంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. మాస్క్‌లు, సెన్సిటైజర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. వాటిని ప్రజలకు ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. మురికివాడల్లో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా మాస్క్‌లు, సెన్సిటైజర్లు ఉచితంగా పంపిణీ చేసే అంశం పరిశీలించాలని పేర్కొంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని.. ఇప్పటి వరకు 18 వేల 224 మందికి పరీక్షలు జరిపినట్లు ఏజీ తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్సులో వచ్చిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. దేశంలో ఎక్కువగా రైళ్లు, బస్సుల్లోనే ప్రయాణిస్తారు కాబట్టి.. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.