Sitarama Project expenditure : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. వెరసి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో రూ.13,058 కోట్లతో సీతారామ ఎత్తిపోతలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 టీఎంసీల నీటి వినియోగంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్‌లు, ప్రధాన కాలువల పనులను ప్రారంభించింది.
Sitarama Project Cost : ఇప్పటివరకు సుమారు రూ.6,500 కోట్లు ఖర్చుచేసింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పథకానికి కేంద్ర జల సంఘం నుంచి అంతర్ రాష్ట్ర అనుమతి సహా అటవీ, పర్యావరణ తదితర అనుమతులు వచ్చాయి. ఆ సమయంలో జలసంఘం ప్రాజెక్టు అంచనాను రూ.11,300 కోట్లకు తగ్గించడంతోపాటు నీటి వినియోగాన్ని 65.25 టీఎంసీలకు పరిమితం చేసింది.
ఇదే సమయంలో ఈ ప్రాజెక్టులో భాగంగానే దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని రూ.3,482 కోట్లతో చేపట్టింది. 67 గేట్లతో 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా నిర్మించడంతోపాటు 280 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇటీవల ప్రభుత్వం ఇల్లెందు, వైరా, పినపాక నియోజకవర్గాల్లో లక్షా 13 వేల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో మొత్తం ఆయకట్టు 7.87 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ నేపథ్యంలో దీనికి అనుమతుల సమయంలో జలసంఘం కొర్రీలు వేయడంతోపాటు రెండింటి డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది.