2014-15 ఆర్థిక ఏడాదికి ముందు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కోటి రూపాయలు ఉండేవి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదే ఈ మొత్తాన్ని రూ.1.5 కోట్లకు పెంచింది. 2016-17 ఆర్థిక ఏడాదిలో కోటిన్నర నుంచి మూడు కోట్లకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల మొత్తాన్ని పెంచింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఏడాదికి మూడు కోట్లు ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతోంది.
ప్రతి ఏడాది రూ.480 కోట్లు..
నామినేటెడ్ శాసనసభ్యుడితో కలిపి 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు.. మొత్తం 160 మంది రాష్ట్రంలో ఉన్నారు. వీరికి ప్రతి ఏడాది రూ.480 కోట్లు మొత్తాన్ని నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రతిపాదించాల్సి ఉంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ.362 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఆ తరువాత దాన్ని రూ.298 కోట్లకు సవరించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి నిధులు రూ.299 కోట్లు మాత్రమే వ్యయమయ్యాయి.