Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించనుంది. జూన్ రెండో తేదీ నుంచి 21రోజుల పాటు వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజులపాటు ఆయా రంగాల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు.
Telangana Decade Celebrations Action Plan : అందుకు అనుగుణంగా అన్ని శాఖలు తమ శాఖల పరంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశాయి. వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని వ్యవసాయశాఖ కోరింది. అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా-సంక్షేమ శాఖ, గురుకులాల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి.
Telangana formation day Celebrations 2023 : మిగతా శాఖలు కూడా ప్రతిపాదనలు రూపొందించాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరోదఫా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ఉత్సవాల ప్రణాళికను ఖరారు చేయనున్నారు.