వ్యవసాయంలో నకిలీ విత్తనాలు.. విద్యావ్యవస్థలో నకిలీ ధ్రువపత్రాలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ తీసుకువచ్చిన స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి అధికారులు, వీసీలతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు.
2010 నుంచి 2021 వరకు అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన వివిధ కోర్సుల పట్టాలన్నింటిని ఈ పోర్టల్‌లో ఉంచనున్నారు. గత 12 ఏళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డాటాను ఇందులో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా అవకాశం ఉంటుంది. పోర్టల్‌ను పటిష్ఠంగా అమలుచేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి, డీజీపీ తెలిపారు.
గుర్తించేది ఇలా:రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలిచ్చే డిగ్రీ, పీజీ, బీటెక్, అగ్రికల్చర్, ఎంబీబీఎస్, ఎంబీఏ తదితర అన్ని రకాల సర్టిఫికెట్లను ఒక పోర్టల్‌లోకి తెచ్చి నకిలీ పట్టాలకు తెరదించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి గత ఏడాది కాలంగా పోలీసుశాఖతో కలిసి పనిచేస్తోంది.
అసలా? కాదా? అని తెలుసుకోవడానికి ఎటువంటి ఫీజు ఉండదు. మార్కుల శాతం, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం ఆన్‌లైన్‌లోనే కొంత రుసుము చెల్లించాలి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) వెబ్‌సైట్ ద్వారా దేశ విదేశాల్లోని వర్సిటీలు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు.