తెలంగాణలో తెరాస ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నిరుద్యోగ భృతి హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు పాలనను గాలికొదిలేసి కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకునేది ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని.. ముఖ్యమంత్రులను మార్చుకోవడం కోసం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు అనేది ఆ పార్టీ అంతర్గత విషయమని భట్టి వ్యాఖ్యానించారు. రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరంపై రూ.లక్ష 15 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రాజెక్టులపై అంచనాలు పెంచుకుంటూపోతున్నారని ఆరోపించారు. గోదావరి ద్వారా చుక్కనీరు కూడా తరలించలేకపోయారని విమర్శించారు.