Life Tax on vehicles:రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాబడి మార్గాలను అన్వేషిస్తోంది. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా... సామాన్యుడిపై మరో ధరల పిడుగు వేసింది. వాహన కొనుగోలుదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం సోమవారం అమలులోకి వచ్చింది. లక్ష రూపాయలలోపు విలువ చేసే ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 9 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఇక నుంచి 12 వేలు జీవితకాల పన్ను చెల్లించాలి. అంటే 3 వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల లోపు విలువ చేసే కారు కొనుగోలు చేస్తే గతంలో సుమారు లక్షా 20 వేల రూపాయలు పన్ను రూపంలో చెల్లించేవారు. ఇక నుంచి లక్షా 40 వేల రూపాయలు చెల్లించాలి. అంటే 20 వేల రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది.
ఇప్పటివరకు అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని ప్రభుత్వం 4 శ్లాబులకు పెంచింది. గతంలో 10 లక్షలలోపు విలువ చేసే వాహనాలకు ఒక పన్ను, 10 లక్షల విలువ దాటిన వాహనాల పన్ను మరొకటిగా ఉండేది. తాజాగా వాహన విలువలను 4 విభాగాలుగా విభజించి పన్నులను వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. వాహనాల విలువలో ఒకటి నుంచి 6 శాతం అదనంగా పెంచింది. అదే ద్విచక్రవాహనాల విషయానికొస్తే 1 నుంచి 3 శాతం వరకు పన్ను పెరిగింది. గతంలో కొత్త వాహనాలకు 9 శాతం ట్యాక్స్ ఉండేది. తాజాగా 50 వేల విలువ దాటిన కొత్త వాహనంపై 12 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి రెండో వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలోలాగే 2 శాతం మొత్తాన్ని అదనంగా కట్టాలి. గతంలో ద్విచక్ర వాహనాలు ఇంజిను సామర్థ్యం 60 CC, 60సీసీలు మించిన వాహన కేటగిరీలు ఉండేవి. తాజాగా వాహన విలువ ఆధారంగా రెండు శ్లాబుల్లో పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. తాజా పెంపు వల్ల వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందన్నది సర్కారు అంచనా వేసింది.
మూడు, నాలుగు చక్రాలు, మోటారు క్యాబ్స్, కార్లు, జీపులు 5లక్షల లోబడి ఉన్న వాహనాలకు 13 శాతం, 10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 14శాతం, 20 లక్షల లోపు ఉన్న వాహనాలకు 17 శాతం, 20 లక్షల పైబడి ఉన్న వాహనాలకు 18 శాతంగా నిర్ణయించారు. రవాణా వాహనాలకు సంబంధించి 5 లక్షల లోపు ఉన్న వాహనాలకు 15 శాతం, 10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 16 శాతం, 20 లక్షలు ఉన్న వాహనాలకు 19 శాతం, 20 లక్షల పైబడి ధర ఉన్న వాటికి 20 శాతంగా నిర్ణయించారు. వాహనాల జీవితకాల పన్నును రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తరవాత పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా 3 వేల 335 కోట్లు రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,953 కోట్ల వరకు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనాకారణంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలు కొనుగోలు పెరుగుతోంది. ఈక్రమంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.