Government Focus on Jowar Procurement : పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే మంచి దిగుబడులు వస్తాయని అన్నదాతలు యాసంగిలో.. అధిక విస్తీర్ణంలో జొన్న పంట సాగు చేశారు. మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా ఈ పంట వేశారు. ఆశించిన మేర దిగుబడులు వస్తున్నాయి. అయితే బహిరంగ విపణిలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని : ఈ క్రమంలోనే జొన్న రైతులకు సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో పండించిన యాసంగి జొన్న పంటకు.. మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాల మేరకు టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థను.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించింది. 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న- హైబ్రిడ్ పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంట కొనుగోలు : ఇందుకు సంబంధించి మార్క్‌ఫెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చర్యలు చేపట్టాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌లో పండించిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంట కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్లను.. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు గ్యారెంటీ ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ తదితర జిల్లాల పరిధిలో ఉన్న జొన్న రైతులకు లబ్ధి కలగనుంది.
దాదాపు లక్ష మంది రైతులకు లబ్ధి : ఆయా జిల్లాల్లో జొన్న పంట పండించిన దాదాపు లక్ష మంది రైతులకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా మంచి లబ్ధి చేకూరనుండటం విశేషం. ఈ యాసంగి సీజన్‌లో 65,494 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రానుంది. అంటే సగటున ఎకరాకు 5.16 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.