NOTICES TO AP EMPLOYEES UNION: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం 'రోసా' నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నోటీసులపై వారం లోగా సమాధానం ఇస్తామన్న ఉద్యోగుల సంఘం నేతలు.. నిబంధనల ప్రకారం అయితే అన్ని సంఘాల మీద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని ఆదేశించింది.