TS Govt: పట్టణ ప్రగతి కింద గడిచిన మూడేళ్లలో రూ.4,304 కోట్లు విడుదల Govt on Pattana Pragathi Funds: పట్టణ ప్రగతి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా బద్ధమైన పద్దతిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
ప్రతి ఏటా తెలంగాణకు జాతీయ అవార్డులు: వినూత్న ఒరవడితో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంతో దేశంలో ప్రామాణిక నగరాలు, పట్టణాలు ఉన్న రాష్ట్రంగా ప్రతి ఏటా తెలంగాణకు జాతీయ అవార్డులు అందుతున్నాయని తెలిపింది. పట్టణ ప్రగతి కింద 2020 ఫిబ్రవరి నుంచి జీహెచ్ఎంసీతో పాటు 142 పురపాలక సంస్థలకు రూ.4 వేల 304 కోట్లు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధుల్లో ఇప్పటివరకు రూ.3 వేల 936 కోట్లు అంటే దాదాపు 92 శాతం నిధులను పట్టణాలు వినియోగించుకున్నట్లు తెలిపింది.
జీహెచ్ఎంసీకి రూ.2 వేల 276 కోట్లు, మిగిలిన 141 పట్టణాలకు రూ.2 వేల 28 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు నెలకు 116 కోట్ల చొప్పున నిధులు ఇచ్చినట్లు పేర్కొన్న సర్కార్... జీహచ్ఎంసీకి నెలకు 61 కోట్లు, ఇతర 141 పట్టణాలకు 55 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు వివరించింది. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపింది.
చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు కంపోస్టు బెడ్స్: చెత్త సేకరణకు కొత్త వాహనాల కొనుగోలు, డంప్ యార్డులు, డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు కంపోస్టు బెడ్స్‌ను నెలకొల్పినట్లు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ మినహా ఇతర చోట్ల 428 కోట్లతో 139 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో 20 పూర్తి కాగా 14 చోట్ల పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొంది. 49 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉండగా.. మరో 50 చోట్ల పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
2023-24లో రూ.2 కోట్లకుపైగా మొక్కలు నాటాలని లక్ష్యం: పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను పురపాలక సంస్థల్లో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 141 పురపాలక సంస్థల్లోని 3468 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పార్క్‌లను అభివృద్ధి చేయడంలో భాగంగా 2021 నుంచి ఇప్పటి వరకూ 34 లక్షలకుపైగా మొక్కలు నాటినట్లు పేర్కొంది. హరితహారం కింద 2023-24లో 141 పురపాలక సంస్థల్లో రెండు కోట్లకుపైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా 1012 నర్సరీలలో రెండు కోట్ల 36 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు పేర్కొంది.
పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 141 పురపాలికల్లో 796 స్ట్రెచ్‌లలో 1208 కిలోమీటర్ల మేర పలు రకాల మొక్కలు నాటారు. 141 పురపాలికల్లో ఇప్పటివరకు 779 కోట్ల నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడంతోపాటు హరితనిధి కింద కోటి 43 లక్షలు జమ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. 141 పురపాలక సంస్థల్లో ప్రభుత్వం 453 వైకుంఠధామాలు మంజూరు చేసి అందులో 297 పూర్తి చేసినట్లు తెలిపింది. మరో 149 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో చేపడుతున్న పర్యావరణహిత అభివృద్ధి పనులతో తెలంగాణలోని పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి: