International Mobility Valley: జీనోమ్ వ్యాలీ తరహాలో వాహన రంగంలో భారీగా పెట్టుబడుల సాధన, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన సహా బహుముఖ ప్రగతి లక్ష్యంతో తెలంగాణలో అంతర్జాతీయ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల తయారీ, సాంకేతికత, పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా.. అత్యుత్తమ ఆటోమోటివ్ ఎకో సిస్టం(పర్యావరణ వ్యవస్థ)ను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యాలీ ఏర్పాటుకు వికారాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తోంది.
ఇతర రంగాలతో పోలిస్తే వాహన రంగంలో తెలంగాణ కొంత వెనుకబాటులో ఉంది. ఆ రంగంలోనూ అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రవాణా వాహనాల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. దేశంలో తొలిసారిగా విద్యుత్ వాహనాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వాహన రంగంలో పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక కేంద్రాలను పెద్దఎత్తున ఏర్పాటు చేయిస్తోంది. ఈ రంగం ప్రాచుర్యం కోసం దేశంలో తొలిసారిగా ఫార్ములా-ఇ రేసుకు ఆతిథ్యం ఇస్తోంది.
వాహనాలపై శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 1999లో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్రాల సమూహంగా ఎదిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొబిలిటీ వ్యాలీకి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
రెండు వేల ఎకరాల్లో:మొబిలిటీ వ్యాలీని రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో రవాణా సంస్థల అవసరాల ప్రాతిపదికన అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించనుంది. సంప్రదాయ ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల(ఓఈఎం)తో పాటు సరఫరాదారులు, సాంకేతిక సంస్థలు, అంకురాలకు ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు.