సాగునీటి రంగానికి ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో మొత్తం రూ.16,919.94 కోట్లను కేటాయించింది. దీనికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తీసుకొనే రుణం అదనం. ఈసారి మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కేటాయించారనుకుంటే ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్దేశించిన మొత్తం దాదాపు 47 (46.8) పైసలుగా ఉంది.
సాగునీటి రంగంలో చరిత్రే!
తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.1.12 లక్షల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేస్తే కాళేశ్వరంపైనే సుమారు రూ.70 వేల కోట్లు వెచ్చించింది. నాలుగున్నరేళ్లలో ఇంత భారీ వ్యయం ఒక ప్రాజెక్టుపై చేయడం సాగునీటి రంగంలో చరిత్రే!
నీటిని మళ్లించే పనులపై ప్రభావం
మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు, గంధమల, బస్వాపుర రిజర్వాయర్లకు నీటిని మళ్లించే పనులు, ఉమ్మడి నిజామాబాద్‌కు నీటిని మళ్లించే పనులకు బ్యాంకు రుణం లేదు. బడ్జెట్ నుంచి తక్కువగా చేసిన కేటాయింపు ఈ పనుల పూర్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటికి కూడా రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డికి...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.960 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మంజూరైన రుణంలో సుమారు రూ.నాలుగువేల కోట్లు ఇంకా ఉంది. కార్పొరేషన్ నుంచి తీసుకొన్న రుణానికి మార్జిన్‌మనీ అవసరం లేదని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఇలా సుమారు రూ.ఐదువేల కోట్లు పాలమూరు-రంగారెడ్డికి అందుబాటులో ఉంటున్నట్టు. చిన్ననీటి పారుదల, మధ్యతరహా ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌లో ఎక్కువ మొత్తంలోనే ప్రతిపాదించారు.
రూ.7,003 కోట్లు వడ్డీలు, మార్జిన్‌మనీకే
బడ్జెట్‌లో రూ.7,921 కోట్లు కేటాయించినా ఇందులో రుణాలు రాని పనుల కోసం ఇచ్చింది. రూ.918 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.7,003 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్‌కు కేటాయించింది. ఇప్పటికే తీసుకొన్న రుణాలకు వడ్డీలు, తీసుకోబోయే రుణాలకు 20 శాతం మార్జిన్ మనీ మొదలైన వాటికి ఈ మొత్తం ఖర్చు చేస్తారు.
కేటాయింపులు
- 2020-21: రూ.11,043 కోట్లు
- 2021-22: రూ.16,919.94 కోట్లు
ఇదీ చదవండి:వ్యవసాయానికి పెద్దపీట... సంక్షేమం, అభివృద్ధే ప్రాధాన్యత