కేంద్ర వార్షిక బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి స్పష్టత వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పెద్దగా ఏమీ ప్రయోజనం చేకూర్చని కేంద్ర ప్రభుత్వం... రావాల్సిన నిధుల్లోనూ.. కోత విధించింది. కేంద్ర పన్నుల రాష్ట్ర వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రంపై ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మూడు వేల కోట్లకు పైగా నిధులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నిధులు ఏ మేరకు వస్తాయోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
బాగా తగ్గనున్న నిధులు..
15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు కూడా బాగా తగ్గనున్నాయి. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక అయినప్పటికీ.. భవిష్యత్‌లో వచ్చే పూర్తి స్థాయి నివేదికలోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అంటున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు అంతంతమాత్రంగానే రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల్లో కోత వేయడం ఏ మాత్రం సబబు కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మాత్రం యధాతథంగా నిధులు ఇస్తూ మన రాష్ట్రానికి తగ్గించడం ఏ మేరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం..
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోగా... మళ్లీ తగ్గడం రాష్ట్ర ప్రణాళికలకు ఇబ్బంది కలిగించనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ సిద్ధం కానుంది. సహకార ఎన్నికలు ముగిశాక రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇందువల్ల బడ్జెట్ కసరత్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి.