రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై ఒకటో తేదీ నుంచి కొత్త వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ సంఘాన్ని కూడా నియమించింది. అయితే వివిధ కారణాల రీత్యా కమిషన్ నివేదిక రాకపోగా... వేతన సవరణ కూడా ఆలస్యమైంది. ఉద్యోగులకు పీఆర్సీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచే విషయమై తర్వలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు.
ఒక శాతం ఫిటిమెంట్కు రూ.330కోట్ల భారం
ఆర్థికమాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఒక శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి 330 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. దానికి తోడు ఇప్పటికే ఇచ్చిన డీఏల సర్దుబాటు సహా ఇతరత్రాల వల్ల మరో 3వేల కోట్ల భారం కూడా సర్కార్‌పై పడనుంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏ మేరకు వేతన సవరణ ఉండవచ్చన్న విషయమై ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. వీటితో పాటు అలవెన్సుల సర్దుబాటు, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో కేడర్ సంఖ్య, ఉద్యోగులకు ఎల్టీసీ నిబంధనల్లో సడలింపు తదితర అంశాలు కూడా ఉన్నాయి.