తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పులపై ఆంక్షలు సడలించండి.. కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ లేఖ

అప్పులపై ఆంక్షలు సడలించాలని కోరుతూ తాజాగా కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. బాండ్ల విక్రయానికి, రుణాలకు అనుమతించాలని లేఖలో కోరింది. లేదంటే అభివృద్ధి పనులు నిరర్థకమవుతాయని తెలిపింది. కేంద్రం గతంలో లేవనెత్తిన పలు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో సమాధానం ఇచ్చింది.

Finance department
Finance department

By

Published : May 16, 2022, 5:12 AM IST

Updated : May 16, 2022, 11:03 AM IST

రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్‌ నిర్వహణ (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ -ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర అభివృద్ధి రుణాలపై ఆంక్షలు విధించడంపై సరికాదని పేర్కొంది.నూతన రుణ నిబంధనలపై ఈ నెల 9న కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. గతంలోలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో బాండ్ల విక్రయానికి అనుమతించాలని కోరింది. బడ్జెట్‌ వెలుపల తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా పాత విధానం కొనసాగించాలని వివరించింది. కేంద్రం గతంలో లేవనెత్తిన పలు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో సమాధానం ఇచ్చింది.

ఆ నిబంధనలు సహేతుకం కాదు

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాలను సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రుణాలుగానే పరిగణించి ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తామని కేంద్రం చెప్పడంపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు ఏవైనా.. గతంలో వాటికి వర్తింపచేయడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. సాగు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలు, పెట్టుబడి వ్యయాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల మేరకు నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు తెలియజేసింది.

కేంద్రం లెక్కలు రాష్ట్ర ప్రతిపాదనలకు భిన్నం

తెలంగాణ రాష్ట్రానికి 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు రూ.42,728 కోట్ల మార్కెట్‌ రుణానికి, పనితీరు ప్రాతిపదికగా మరో 0.5 శాతం రుణానికి అవకాశం ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రూ.59,672 కోట్ల రుణాల సేకరణకు ప్రతిపాదించింది. దీంతోపాటు సాగు-తాగు నీటి ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్‌కే సుమారు రూ.30 వేల కోట్ల కొత్త రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీటి సరఫరా సంస్థకు రూ.2,832 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థకు రూ.2,315 కోట్లు, ఆ తర్వాత టీయూఎఫ్‌ఐడీసీ, ఆర్టీసీ, గృహనిర్మాణ సంస్థ, రోడ్ల అభివృద్ధి తదితర వాటికి ప్రధానంగా రుణాలు సమీకరించుకోవాలని ప్రతిపాదించింది. కేంద్ర నిబంధనల నేపథ్యంలో ఆ మేరకు నిధుల సమీకరణ సమస్యగా మారే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రం అప్పులు ఇవీ..

గత ఆర్థిక సంవత్సరం (మార్చి) ఆఖరు నాటికి రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న మార్కెట్‌ రుణాలు రూ.2,85,120 కోట్లు, బడ్జెట్‌ వెలుపల ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలు రూ.1,35,282 కోట్లకు చేరాయి.

లేఖలో పేర్కొన్న మరికొన్ని అంశాలు..

*ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన మేరకే రెవెన్యూ రాబడుల ఆధారంగా బడ్జెట్‌ వెలుపల రుణాలు తీసుకుంటున్నాం. ఆ రుణాలను పూర్తిగా పెట్టుబడి రూపంలోనే వ్యయం చేస్తున్నాం.

*అర్ధాంతరంగా రుణాలు ఆపివేస్తే.. వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తికావు. ఇప్పటివరకు చేసిన వ్యయం నిరర్థకం అవుతుంది.

*అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి, వాటిద్వారా అందే ఫలాలతో రుణాలను చెల్లించేందుకు మార్గం సుగమం అవుతుంది.

*జాతీయ బ్యాంకులు, నాబార్డ్‌ వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాం.

*రాష్ట్రం విక్రయించిన బాండ్లలో 49 శాతం రుణాలను 2036వ సంవత్సరం తర్వాతే చెల్లించాల్సి ఉంటుంది.

*జీఎస్‌డీపీలో రాష్ట్ర రుణాలు 25 శాతంలోపే ఉన్నాయి.

ఇవీ చూడండి:కేసీఆర్‌ దిల్లీకి వస్తాడనే భయంతోనే విషం చిమ్ముతున్నారు: జగదీశ్​ రెడ్డి

దాహం తీర్చుకునేందుకు మృగరాజుల పాట్లు.. పొలాల్లోకి వచ్చి

Last Updated : May 16, 2022, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details