ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఉద్యోగులు గత 9 నెలలుగా కరోనా నియంత్రణ కోసం కష్టపడ్డారు. ఈ ప్రక్రియలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది కరోనా బారినపడ్డారు. అయినా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు.. కరోనాపై పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చింది.
-ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
కరోనా వ్యాక్సిన్ను మొదట ఉద్యోగులకు ఇస్తామని ప్రభుత్వం శుభవార్త చెప్పిందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి మొదలవనుండటంతో.. ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. మొదట ఒక డోస్ ఇచ్చిన నెల తర్వాత మరలా రెండో డోస్ ఇవ్వనుండటంతో.. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. అంతవరకు ఎన్నికలు వాయిదా వేయాలని వారు హైకోర్టును కోరనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్ల పైబడిన వారే కావడంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ ఇచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఇదీ చదవండి:రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ