మున్సిపాలిటీల్లో 74.40 శాతం, కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. రేపు ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేత ఎంపిక ఉంటుందన్నారు.
నగరపాలక, మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి నగరపాలక, మున్సిపల్ ఫలితాలు వస్తాయన్నారు. ఈనెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక, 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు.
రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 26న 11 గంటల వరకు ఏ ఫామ్ ఇవ్వాలని... 27 ఉదయం 10 గంటల వరకు బీ ఫామ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చని.. విప్ ఎవరన్నది పార్టీలు 26న ఉదయం11 గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. విప్ జారీ వివరాలను 27 ఉదయం11.30 వరకు అందించాలి.
పరోక్ష ఎన్నిక నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి లాగే ఉంటుందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేశానన్న మంత్రి గంగుల కమలాకర్ చెప్పిన అంశాన్ని పరిశీలిస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: నాగిరెడ్డి ఇదీ చూడండి: 'గులాబీ తీస్కో... సురక్షితంగా గమ్యం చేర్చు'