మినీ పురపోరు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి ప్రతి నియమ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని... ఉల్లంఘనలను కఠినంగా పరిగణించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. మూడో తేదీన లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్ఈసీ... కరోనా నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు పరిశీలకులు, అధికారులను ఆయన అభినందించారు. లెక్కింపు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను పూర్తి చేసి మూడో తేదీ ఉదయం ఆరు గంటల్లోపు వైద్యాధికారుల నుంచి ధ్రువపత్రాలు పొందాలని తెలిపారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఉంటేనే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలని... లోపలికి వెళ్లే ముందు అందరినీ థర్మల్ స్కానర్లతో పరీక్షించాలని పార్థసారథి స్పష్టం చేశారు.