ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, నియామకం, వేతనం చెల్లింపు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
అంతా రహస్యంగానే...
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్, నోటిఫికేషన్ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. అన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం కావడం వల్ల బహిర్గతం చేసింది.