జ్వరం నయమవడానికి తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించడంలో జరిగిన పొరపాటుకు జ్వరం తగ్గే మాట దేవుడెరుగు గానీ.. ఆ చిన్నారి అరచేతినే కోల్పోయింది. తోటి మిత్రులతో ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆనందంగా గడపాల్సిన ఆ బాలిక నాలుగేళ్ల ప్రాయంలోనే వైకల్యం పొందగా.. సుమారు 20 ఏళ్లపాటు పోరాటం చేస్తేగానీ ఆమెకు న్యాయం దక్కలేదు.
ఎట్టకేలకు బాధితురాలికి తగిన పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాల్సిందేనంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తాజాగా తీర్పునిచ్చింది. సెలైన్ అందించడానికి ఇంజక్షన్ పైపును సరిగా అమర్చకపోవడంతో అంగవైకల్యం పొందిన బాధితురాలికి వైద్యుడు, బీమా సంస్థ 2016 సెప్టెంబరు నుంచి రూ.16 లక్షల పరిహారాన్ని 7 శాతం వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యంతో 19 ఏళ్ల క్రితం చేతిని కోల్పోయిన బాధితురాలికి ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన డి.రమేష్‌బాబు జ్వరంతోపాటు బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమార్తె సౌమ్యను 2003లో హనుమకొండ అమృత నర్సింగ్ హోంలోని డాక్టర్ జి.రమేష్ వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు చికిత్స అందించి రెండు రోజుల తరువాత డిశ్ఛార్జి చేశారు. అనంతరం సెలైన్ ఎక్కించడానికి ఇంజెక్షన్ ఇచ్చిన కుడి చేయికి వాపు వచ్చి నొప్పి పెరిగిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరిగి వైద్యుడిని సంప్రదించగా.. హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు డాక్టర్ వద్దకు వెళ్లాలని సిఫారసు చేశారు.