Voter ID link with Aadhar: ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం ఐచ్ఛికం మాత్రమేనని ఆయన తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చే జిల్లా స్థాయి మాస్టర్ ట్రెయినర్లతో సీఈవో సమావేశమయ్యారు.
ఓటుహక్కు దరఖాస్తు కోసం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫారం 6, ఫారం 6ఏ, ఫారం 7, ఫారం 8 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కొత్త దరఖాస్తు ఫారాల విషయంలో బీఎల్వోలు, ఈఆర్వోలు, బీఎల్వో సూపర్ వైజర్లు, ఏఈఆర్వోల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వికాస్ రాజ్ సూచించారు. శిక్షణా ప్రక్రియ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. ఆఫ్ లైన్ దరఖాస్తుల కంటే కూడా ఆన్‌లైన్ దరఖాస్తులను ఎక్కువగా ప్రోత్సహించేలా బీఎల్వోలు గరుడా యాప్‌ను ఉపయోగించేలా చూడాలని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.