తుది దశకు చేరుకున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు Telangana Budget 2023: వచ్చే శుక్రవారం నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను సర్కారు అసెంబ్లీ, కౌన్సిల్ ముందు ఉంచనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ తుది కసరత్తు కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పద్దు రూపకల్పనపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తుంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పద్దులకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు, ఎన్నికల హామీల అమలు అంశాలకు వార్షిక ప్రణాళికలో పెద్ద పీట వేయనున్నారు.
2023-24 State Budget Meetings: సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి లోబడి రుణమాఫీ పూర్తి చేయడం, తదితరాలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, నీటి పారుదల ప్రాజెక్టులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పథకాలకు బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించనున్నారు.
వచ్చే ఏడాది అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖలు, కార్యక్రమాలకు పద్దు కేటాయించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో పూర్తిగా ఆ దృష్టితోనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ అధికారుల కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ మరోమారు బడ్జెట్‌పై సమీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రతిపాదన ఖరారు చేయనున్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది కోసం ఆర్థిక ప్రణాళికపై చర్చించి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.
ఇవీ చదవండి: