రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. శాసనసభలో సీఎం కేసీఆర్, మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ భేటీ కానున్న ఉభయసభల సభా వ్యవహారాల సలహా సంఘాలు ఈ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నాయి.
ఉదయం 11.30 నిమిషాలకు...
ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్నెళ్ల కాలానికి నిధులు ఖర్చు చేసేందుకు అసెంబ్లీ, మండలి అనుమతి తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉభయసభలు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కేవలం బడ్జెట్ ప్రతిపాదనకు మాత్రమే నేటి సమావేశాలు పరిమితమవుతాయి. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి.
పూర్తి స్థాయి ఎజెండా ఖరారు
బడ్జెట్ సమావేశాల పూర్తి స్థాయి ఎజెండా నేడు ఖరారు కానుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి అన్న విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమవుతాయి.